22 April, 2026 | 4:06 AM

మరకత శివాలయ అభివృద్ధి కోసమే విరాళాలు

23-04-2026 12:00 AM

ప్రతి పైసాకు లెక్క చూపిస్తాం

శంకర్ పల్లి; ఏప్రిల్ 21 (విజయక్రాంతి): దాతలు మరియు భక్తులు ఇచ్చే ప్రతి విరాళం ఆలయ అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నామని, దేవాదాయ శాఖకు ప్రతి రూపాయికి సంబంధించిన లెక్కలను చూపిస్తామని ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర రావు (వీడియో రావు) స్పష్టం చేశారు.

మంగళవారం శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల చారిత్రాత్మక శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల ఆలయ ఆదాయ, వ్యయాల లెక్కలను చూపాలని దేవాదాయ శాఖ వారు 15 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారని, దీనిపై స్పందిస్తూ పూర్తి నివేదిక సమర్పించడానికి తాము మూడు నెలల గడువు కోరినట్లు వెంకటేశ్వర రావు తెలిపారు.

ఆలయ నిధుల్లో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టారు.  2018 నుండి 2023 వరకు సదానందం గౌడ్ చైర్మన్గా ఉన్న సమయంలో, ముఖ్యంగా కోవిడ్ (2020-21) కాలంలో భక్తులు రాక, అర్చకులకు జీతాలు ఇవ్వడం కూడా భారంగా మారిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

తొలినాళ్లలో గ్రామస్తులే చందాలు వేసుకొని పౌర్ణమికి అన్నదానం చేసేవారని, 2024 నుండి భక్తుల రద్దీ పెరగడంతో ఇప్పుడు ప్రతి ఆది, సోమ వారాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.భక్తుల సౌకర్యార్థం నిర్మాణాలు శివరాత్రి, కార్తీక మాసాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వసతి సౌకర్యాల కొరతను తీర్చడానికి గ్రామ పంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులను నిర్మించినట్లు చెప్పారు. ఈ గదుల ద్వారా వచ్చే నామమాత్రపు రుసుమును తిరిగి ఆలయ అభివృద్ధి పనులకే వాడుతున్నామని వివరించారు.

క్రమబద్ధమైన నిర్వహణ

స్వామివారి అభిషేకానికి, అన్నదాన విరాళాలకు మరియు లడ్డు, పులిహోర ప్రసాదాలకు భక్తులకు ఖచ్చితమైన రసీదులు అందజేస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలయం ప్రతి ఒక్కరిదని, భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. సమావేశంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు దేవేందర్ రెడ్డి, సాగర్, సుధీర్ గౌడ్, లీలావతి, విట్టలయ్య, అనంతయ్య, వెంకటస్వామి, నవీన్ మరియు అర్చకులు సాయి శివ ప్రసాద్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.