25 April, 2026 | 3:40 PM

ప్రతిభావంతుల మేథాశక్తిని కించపరుస్తారా?

18-09-2025 01:53 AM
  1. మెరిట్ ప్రకారమే గ్రూప్-1 జాబితా 
  2. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉంది             
  3. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

సూర్యాపేట, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, మెరిట్ ప్రకారమే గ్రూప్-1 జాబితా సిద్ధం చేశారని, కానీ కొంతమంది ప్రతిభావంతుల మేథాశక్తిని కించపరుస్తూ మానసికంగా దెబ్బతీయటానికి ప్రయత్నించడం సరికాదని ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో, రాష్ట్ర సాధనలో అమరులైన వారికి ఈ సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తిస్థాయి నమ్మకం ఉందని, ప్రతిభావంతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. కాగా పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అపిడవిట్‌లను స్పీకర్‌కు అందజేశారని, వారి విష యం ఆయన పరిధిలో ఉన్నదన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదన్నారు. రైతు, యువత, కార్మికులు, సామాన్య ప్రజలు అందరిని దృష్టిలో పెట్టుకొని గడిచిన 20 నెలలు సంక్షేమ పాలన అందించామన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగకల్పన  చేశామని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు ఎంత యూరి యా అవసరమో అంత యూరియా వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేస్తామని, రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు.

మంగళవారమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రిని కలిసి యూరియాను ఎక్కువ మొత్తంలో సరఫరా చేయాలని కోరారని, అదేవిధంగా ఫీజ్ రియింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఆయన వెంట తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఉన్నారు.