21 July, 2026 | 11:50 AM

ఎలాంటి చర్యలు చేపట్టొద్దు

21-07-2026 12:03 AM
  1. బహదూర్‌గూడ భూములపై హైకోర్టు ‘స్టే’
  2. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై హైకోర్టులో నలుగురు రైతుల పిటిషన్
  3. బాధిత రైతులకు భారీ ఊరట!

రంగారెడ్డి, జూలై 20 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఎలాంటి తదుపరి చర్యలు  తీసుకోకూడదని స్పష్టం చేస్తూ, పిటిషన్ వేసిన నలుగురు రైతులకు భారీ ఊరటనిచ్చింది.  బహదూర్‌గూడలోని రెండు ప్రధాన సర్వే నంబర్ల (3, 4) పరిధిలో ఉన్న మొత్తం 650 ఎకరాల భూమిని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించడంపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బహదూర్‌గూడ గ్రామ పరిధిలోని 28 ఎకరాల భూమి తమదేనని, ఇందులో అధికారుల జోక్యాన్ని నిరోధించాలని కోరుతూ నలుగురు రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిష న్ దాఖలు చేశారు. ఈ 650 ఎకరాల పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమిపై తమకు స్పష్టమైన హక్కులు ఉన్నాయని, తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ్ సేన్‌రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇచ్చారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గత 30 ఏళ్లకు పైగా రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అధికారులు అక్రమంగా జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రాజెక్టు కేటాయింపుల పేరుతో పేద రైతుల హక్కులను కాలరాయడం చట్టవిరుద్ధమని, తక్షణమే అధికారుల చర్యలను నిలిపివేయాలని కోర్టును కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

పిటిషనర్లు పేర్కొంటున్న సర్వే నంబర్ల భూముల జోలికి ప్రభుత్వంగానీ, రెవెన్యూ అధికారులుగానీ వెళ్లలేదని కోర్టు దృ ష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి పిటిషనర్లకు చెందిన 28 ఎకరాల భూముల్లో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకూడదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.