8 July, 2026 | 1:17 AM

‘ఫీజుల స్కీమ్‌ను ఎత్తివేయొద్దు’

08-07-2026 12:23 AM
  1. రూ.8వేల కోట్లు బకాయిలు చెల్లించాలి
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య 
  3. అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ప్రదర్శన 

ముషీరాబాద్, జూలై 7(విజయక్రాంతి): రాష్ర్టంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల పీజుల బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ స్కీమ్ ఎత్తివేయాలనే కుట్రలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమును యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు మంగళవారం లిబర్టీ చౌరస్తా నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ విద్యార్ధి సంఘం కన్వీనర్ నిఖిల్ పటిల్, శివ కుమార్ యాదవ్ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ  ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ స్కీముకు బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటుంటే కూడా ఓర్వలేక పోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నదని మండిపడ్డారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్ర కాకుండా 23 వేల ప్రభుత్వ స్కూళ్లను రద్దు చేస్తామని బహిరంగంగా సీఎం ప్రకటించడం సరైంది కాదన్నారు.

అలాగే గురుకులాలను కూడా రద్దు చేసే కుట్రకు తెర తీస్తున్నారని ఆరోపించారు. గతంలోని ముఖ్యమంత్రులంతా విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ సీఎం గొడ్డలితో నరికే తిరోగమన చర్యలకు పాల్పడుతున్నాని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేస్తే రాష్ర్టంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సి. రాజేందర్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ ఐక్య కులాల అధ్యక్షుడు జి.  అనంతయ్య తో పాటు వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.