1 August, 2026 | 10:22 PM

మందమర్రి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి

01-08-2026 09:35 PM

- జీఎం రాధాకృష్ణ 

- గైర్హాజరు నివారణకు చర్యలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మందమర్రి ఏరియాలో జూలై మాసంలో 106% బొగ్గు ఉత్పత్తి, 105% ఓబి సాధించినట్టు  జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ చెప్పారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన  ప్రెస్ మీట్‌లో జూలై–2026 మాసానికి సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత కార్మిక సంక్షేమ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గడిచిన జూలై మాసంలో మందమర్రి ఏరియా 106% బొగ్గు ఉత్పత్తి సాధించడంతో పాటు 105% ఓవర్ బర్డెన్ (OB) తొలగింపు లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు.

KK-05 గని KKOC గనులు 100% ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. ఈ ప్రగతికి కృషి చేసిన ప్రతి ఒక్క ఉద్యోగి, సూపర్‌వైజర్లు, అధికారులను ఆయన అభినందించారు. ​అండర్ గ్రౌండ్ (అంతర్గత) గనులలో ఉద్యోగుల గైర్హాజరు వలన ఉత్పత్తికి కొంత విఘాతం కలుగుతోందని, ఈ సమస్యను అధిగమించడానికి యూనియన్ నాయకులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ​ఉద్యోగులు అధికారుల సహాయ సహకారాలతో అండర్ గ్రౌండ్ గనులలో 100% ఉత్పత్తి సాధించేలా, అలాగే ప్రతి ఒక్కరూ రక్షణ (Safety) నాణ్యత (Quality) తో కూడిన ఉత్పత్తిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​ప్రతి నెలా వెల్ఫేర్ ఆఫీసర్లు, పర్సనల్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, CMPF, పెన్షన్లు, CPRMS, క్యాంటీన్ వంటి పలు అంశాలపై ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని  తెలిపారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి  పెండింగ్‌లో ఉన్న అనేక ఫైళ్లను క్లియర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈమధ్య గాలివాన కారణంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, వర్క్‌షాప్ సిబ్బంది శ్రమించి కాలనీలకు తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని తెలిపారు.

రెండు మూడు రోజుల నుండి భారీగా కురిసిన వర్షాలకు ​రామకృష్ణాపూర్ (RKP) లో ఇండ్ల గోడలు, కప్పులు కూలిపోయిన బాధిత కుటుంబాల కోసం ఆర్కేపీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ​మందమర్రి ఏరియాలోని కాసిపేట గనులకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఖాళీ స్థలాలలో భారీగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలోఏరియా ఇంజనీర్ (E&M) బాలాజీ భగవతీ జా, DGM (పర్సనల్)  అశోక్, DGM (IED) కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.