21-02-2026 07:40:09 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు సమయపాలనతో సేవలు అందించడమే లక్ష్యంగా ఐడీఓసి కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని నయాబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీవోలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ... మీసేవ కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగం అత్యంత కీలకమన్నారు. యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి తక్షణమే పోర్టల్‌కు అప్‌డేట్ చేయవచ్చని వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అధికారులు దరఖాస్తుదారుల నివాసానికి వెళ్లి సంబంధిత వివరాలను యాప్‌లో నమోదు చేయడం, జియో-ట్యాగ్‌తో కూడిన లైవ్ ఫోటోలను అప్‌లోడ్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులకు అవకాశం లేకుండా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
భౌతిక ఫైళ్ల కదలిక అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలోనే పరిశీలన పూర్తయ్యే విధంగా వ్యవస్థ ఉండటంతో, ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల దరఖాస్తులు త్వరితగతిన ఆమోదం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు . యాప్ ద్వారా సేకరించిన సమాచారం నేరుగా మీసేవ పోర్టల్‌కు అనుసంధానమై డేటా తక్షణమే అప్‌డేట్ అవుతుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని సుమారు 160 మంది జీపీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 40 మంది నయాబ్ తహసీల్దార్లు మరియు 15 మంది ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
యాప్ డౌన్‌లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు, ఫోటో అప్‌లోడ్, రిపోర్ట్ సమర్పణ తదితర అంశాలపై ప్రదర్శనతో కూడిన సమగ్ర అవగాహన కల్పించారు. అధికారుల సందేహాలకు వివరణాత్మక సమాధానాలు అందించి, యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో మీసేవ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలను వేగవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.