నక్ష సర్వేలో ఖచ్చితత్వమే లక్ష్యం.. వర్షాకాల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి
భూముల రీ సర్వే నమోదు ప్రక్రియ, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
అశ్వాపురం, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నక్ష కార్యక్రమంలో భాగంగా భూముల రీ-సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు కోసం మణుగూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆర్.ఓ.ఆర్. (రికార్డ్ ఆఫ్ రైట్స్) నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మణుగూరు మండలం కొమ్ముగూడెం గ్రామంలో మున్సిపల్ సిబ్బంది నిర్వహిస్తున్న నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఎంట్రీ నమోదు విధానం, సేకరిస్తున్న వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులో సర్వే, నమోదు ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నక్ష పైలట్ ప్రాజెక్టు ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి ప్రజలకు భూములకు సంబంధించిన సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మణుగూరు మండలం అన్నారం, కమలాపురం గ్రామాల్లో గోదావరి వరదల ప్రభావానికి గురయ్యే కోడిపుంజుల వాగు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను సందర్శించి ముంపు పరిస్థితులను సమీక్షించారు.
వరదల సమయంలో ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, ఇతర అత్యవసర సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సింగరేణి పీకేఓ ఓపెన్కాస్ట్ గనుల నుంచి విడుదలయ్యే నీటి ప్రభావంతో ముంపునకు గురయ్యే గాంధీనగర్, సుందరయ్యనగర్, కాళీమాత ఆలయ పరిసరాలు, వినాయకనగర్ ప్రాంతాలను పరిశీలించి డ్రైనేజీల్లో పూడిక, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, వర్షపు నీరు వేగంగా వెళ్లేలా కాలువలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వాతావరణ హెచ్చరికలు, నీటిమట్టాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






