బీసీ మహిళలకు బలమైన అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీకి శ్రీకారం
హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు కణితి రజిని
చర్ల,(విజయక్రాంతి): రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామని కణితి రజిని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బీసీ మహిళలు, ఆడబిడ్డలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టుమిషన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకం అమలు కోసం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ వేగంగా కసరత్తు ప్రారంభించిందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని , గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలను గుర్తించి, వారికి ఉపాధి మార్గాలను చూపించడం ద్వారా కుటుంబాల ఆదాయాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలు ఇంటి వద్ద నుంచే పనులు చేసుకునే అవకాశం కలుగుతుందని,
దీనివల్ల వారికి స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా గృహిణులు, నిరుద్యోగ మహిళలు మరియు చదువు మధ్యలో ఆగిపోయిన ఆడబిడ్డలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండనుందన్నారు . ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించడమే కాకుండా, మహిళలలో ఆత్మవిశ్వాసం పెంపొందించి స్వయం సమృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా మారనుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తరహా చర్యలు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక మార్పులకు దారితీయనున్నాయని కణితి రజిని అభిప్రాయపడ్డరు .






