భద్రాద్రి రామయ్య పురుషోత్తపట్నం భూముల్లో వ్యవసాయ పనులకు దేవస్థానం సానుకూలత
గత పదేళ్ల ఆక్యుపేషన్ చార్జీలు రైతులు చెల్లించాలని ఆదేశం
వ్యవసాయ భూముల్లో బోర్లువేయడం, సాగుకు అనుమతించిన భద్రాద్రి దేవస్థానం ఈవో
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకు చెందిన ఏపీలోని యటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భధ్రాద్రి రామయ్య భూముల్లో ఇప్పటికే వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం సానుకూల నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి దేవస్థానం చరిత్రలో తొలిసారి ఆక్రమణదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
దేవస్థానం, పురుషోత్తపట్నం గ్రామ రైతుల మధ్యలో దశాబ్దాలు కాలంగా జరుగుతున్న పరిణామాలు అన్నిటిని ప్రస్తుత ఈవో దామోదర్ సానుకూలంగా పరిష్కరించారని పురుషోత్తపట్నం గ్రామస్తులు తెలిపారు. అలాగే పురుషోత్తపట్నం రామలయ భూముల్లో వ్యవసాయం చేస్తున్న గ్రామ రైతులు గత సంవత్సరాలుగా కట్టకుండా ఆగిపోయిన ఆక్యుపేషన్ చార్జెస్ ని తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. దీంతో పలువురు రైతులు సోమవారమే ఆక్యుపేషన్ చార్జీలు చెల్లించగా కొందరు రైతులు ఆక్యుపేషన్ చార్జీలు చెల్లించేందుకు కొంత సమయం అడిగారు.
అలాగే ఆ భూములను వారే వ్యవసాయం చేసుకునేలా, బోర్లు వేసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు రైతులతో ఈవో పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి సమస్య లేకుండా, దేవస్థానానికి ఆక్యుపేషన్ చార్జెస్ ను కట్టించగలిగిన ప్రస్తుత ఈవో దామోదర్ రావు ను పురుషోత్తపట్నం గ్రామస్తులు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం రైతులు మాట్లాడుతూ గతంలో ఉన్న పలువురు దేవస్థానం ఈవోలు ఏనాడు కూడా రైతులను పిలిపించి వారి యొక్క సమస్యలు వినే ప్రయత్నం కూడా చేయలేదని, కానీ ప్రస్తుత ఈవో దామోదర్ రావు మాత్రం రైతుల యొక్క సమస్యలను, దేవస్థానం నకు కూడా ఇబ్బంది లేకుండా చేసినందుకు ఆయనకు పురుషోత్తపట్నం రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు






