'విజయ క్రాంతి' కథనానికి స్పందన
అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు
- సామాగ్రి సీజ్
మేడ్చల్,(విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజ్ బొల్లారం వార్డు కార్యాలయం పక్కన మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మిస్తున్న షెడ్డు పనులను మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన సామాగ్రిని సీజ్ చేశారు. 'మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాల జోరు' రాజ్ బొల్లారంలో అనుమతి లేకుండా షెడ్డు నిర్మిస్తున్నారని 'విజయ క్రాంతి'దినపత్రికలో ఈనెల 24న వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించి షెడ్డు నిర్మాణాన్ని శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారి మహేష్ చంద్రకాంత్ పరిశీలించారు.
పనులు ఆపాలని యజమానికి సూచించారు. అక్రమ నిర్మాణం విషయమై నోటీసు కూడా ఇచ్చారు. అయినప్పటికీ యజమాని మున్సిపల్ అధికారుల నోటీసును బేఖాతరు చేస్తూ పనులు కొనసాగించాడు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి మహేష్ చంద్రకాంత్ నిర్మాణ సామాగ్రిని సీజ్ చేశారు. పనులు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.






