26 July, 2026 | 3:07 AM

అడవిలో దాగిన అద్భుతం దేవునిగుట్ట

26-07-2026 12:00 AM
  1. అపురూప చారిత్రక ఆలయం
  2. లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తున్న భక్తులు
  3. మార్చిలో వచ్చే పౌర్ణమినాడు పెద్ద ఎత్తున జాతర
  4. కొత్తూరు సమీపంలో చరిత్రకు నిలువెత్తు నిదర్శనం

ములుగు జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామ సమీపంలోని అడవుల్లో ఉన్న దేవునిగుట్ట తెలంగాణలోని అత్యంత ప్రాచీన, విశిష్ట కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. స్థానికులు ఈ ఆలయాన్ని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంగా భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెల పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు.

భక్తులు పాలు, పెరుగు, పాయసం, కొబ్బరికాయలు, వివిధ రకాల ప్రసాదాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కాగా దేవునిగుట్ట ఆలయ నిర్మాణం భారతీయ శిల్పకళలో ఒక అద్భుతంగా చెప్పవచ్చు. సాధారణంగా ఒకే రాతిపై ఒక శిల్పాన్ని చెక్కడం ఆనవాయితీ. అయితే ఇక్కడ మాత్రం చిన్న చిన్న రాతి బండలపై శిల్పాలను విడివిడిగా చెక్కి, వాటిని ఇటుకల్లా పేర్చి ఒకే శిల్పరూపాన్ని సృష్టించడం అత్యంత విశేషం.

దేవునిగుట్టపైనే రాళ్లను తొలిచి వాటిని నిర్మాణానికి వినియోగించినట్లు కనిపించడం ఈ ఆలయ ప్రత్యేకతను మరింత పెంచుతోంది. అలాగే  ఆలయానికి నాలుగు వైపులా అర్ధపద్మాలు, సింహాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. సుమారు 25 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఆలయం నాటి శిల్పుల ప్రతిభ కు నిదర్శనంగా నిలుస్తోంది. గర్భగుడిలో ప్రస్తుతం పైభాగంలోని కొన్ని రాతి బండలు కదలడంతో ఒక రంధ్రం ఏర్పడింది.

ఇది ఆల యం శిథిలావస్థకు చేరుకుంటోందనే విషయాన్ని సూచిస్తోంది.  ఆలయానికి ఉత్తర దిశలో కొంత దూరంలో రాతి మధ్యలో ఏర్పడిన ఒక సహజ నీటి గుంట ఉంది. దీనిని స్థానికులు కోనేరుగా పిలుస్తారు. ఈ కోనేరు ఏడాది పొడవునా నీటితో నిండి ఉంటుంది. అక్కడ ఎవరైనా నడిస్తే లేదా అడుగుల శబ్దం వినిపిస్తే కోనేరు నీరు లోపలికి కదులుతుందని స్థానికులు చెబుతారు. ఈ విశేషం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అభివృద్ధి కోసం ఎదురుచూపులు

దట్టమైన అడవి మధ్యలో ప్రకృతి అందాలతో పాటు చారిత్రక వైభవాన్ని చాటుతున్న దేవునిగుట్ట ఆలయానికి సరైన రహదారి, పర్యాటక సౌకర్యాలు ఇప్పటికీ లేవు. ప్రభుత్వం, పురావస్తు శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈ ఆలయాన్ని సంరక్షించి అభివృద్ధి చేస్తే, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా దేవునిగుట్ట గుర్తింపు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 బానోత్ యోగి,

వెంకటాపురం (ములుగు),

విజయక్రాంతి