calender_icon.png 18 February, 2026 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామలింగేశ్వర సన్నిధిలో అన్నపూజ చిన్న వాల్గోట్‌లో భక్తుల సందడి

17-02-2026 01:11:44 AM

సిరికొండ ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం యజ్ఞహోమాలతో కార్యక్రమాలు ప్రారంభమవగా, సోమవారం గ్రామ సర్పంచ్ దడివే గణేష్, ఉప సర్పంచ్ రొండ్ల గోవర్ధన్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యుడు భాస్కర్ పాల్గొని స్వామివారి సన్నిధిలో ఉపవాస ముగింపు అన్నపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతనమైనదిగా, శక్తివంతమైన క్షేత్రంగా స్థానికులు విశ్వసిస్తారని తెలిపారు.

స్థానిక విశ్వాసాల ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టు వెనుక కోనేరు ఉండేదని, ఆ కోనేరులో ధోబి సభ్యులు బట్టలు ఉతకడంతో ఆ నీరు స్వామివారికి తాకగా స్వామివారు ఉగ్రరూపం దాల్చి అక్కడే పాదముద్రలు ఉంచి శ్రీ లొంక రామలింగేశ్వర క్షేత్రానికి ప్రయాణమయ్యాడని పురాణాలు చెబుతున్నాయని వివరించారు. కోరిన మొక్కులు తీర్చే స్వామిగా రామలింగేశ్వర స్వామిని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పురోహితులు కులకర్ణి శ్రీనివాస్ అయ్యవారు, గ్రామ కమిటీ సభ్యులు నవీన్ రెడ్డి, నవీన్, గంగ బాపు, వార్డు సభ్యుడు భూమారెడ్డి, గ్రామ యువకులు బుచన్న, శ్రీధర్, శ్రీనివాస్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.