29 May, 2026 | 2:03 AM

ఎర్రుపాలెంలో అభివృద్ధి పనుల జాతర

29-05-2026 12:00 AM
  1. మధిరను  మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
  3. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం
  4. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్, మౌళిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  5. ఎస్సీ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయింపు
  6. ఎర్రుపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన డిప్యూటీ సీఎం

ఎర్రుపాలెం, మే 28(విజయక్రాంతి): మధిర నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఎర్రుపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ లతో కలిసి రహదారులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఆలయ పునర్నిర్మాణ పనులకు వరుసగా శంకుస్థాపనలు చేశారు.

ముందుగా ఎర్రుపాలెం మండలం గోసవీడు గ్రామంలో  2 కోట్ల 80 లక్షలతో గోసవీడు నుండి రామకృష్ణాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, 35 లక్షలతో గోసవీడు ఎస్సీ కాలనీలో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, 2 కోట్లతో  రామన్నపాలెం నుండి కట్లేరు  చెరువు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

*ఇనగాలి గ్రామంలో 6 కోట్ల 75 లక్షలతో ఇనగాలి నుండి సైదెల్లిపురం వరకు, 3 కోట్ల 75 లక్షలతో ఇనగాలి నుండి సిద్ధినేని గూడెం వరకు నిర్మించనున్న బిటీ రోడ్డు నిర్మాణ పనులకు, 31 లక్షలతో  ఇనగాలి ఎస్సీ కాలనీలో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ములుగుమాడు గ్రామంలో కోటి 29 లక్షలతో చేపట్టిన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు, ములుగుమాడు నుండి నాగవరప్పాడు వరకు 3 కోట్ల 75 లక్షలతో,ములుగుమాడు నుండి సైదేల్లిపురం వరకు 3 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, ములుగుమాడు ఎస్సీ కాలనీలో 63లక్షలతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

తక్కెలపాడు గ్రామంలో 4 కోట్ల 50 లక్షలతో తక్కెళ్ళపాడు నుండి మధిర ఆర్ అండ్ బి రోడ్డు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, 69 లక్షలతో తక్కెల పాడు ఎస్సీ కాలనీలో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

పెద్ద గోపవరం గ్రామంలో 132/33 కేవీ ఎర్రుపాలెం సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, జమలాపురం గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేసారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, నియోజక వర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌళిక సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిధుల కొరత లేకుండా పనులు వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనీ, సబ్స్టేషన్ల ఏర్పాటుతో స్థానిక రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.