ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
శంకర్‌పల్లి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
శంకర్‌పల్లి: జూన్ 8 (విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని శంకర్ పల్లి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కొండకల్, టంగుటూరు, గాజులగూడ, సంకేపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆవరణలల్లో స్వచ్ఛగావ్ సురక్షిత్ జలవాయు సభలు నిర్వహించారు.
కొండకల్ గ్రామసభలో ఎంపీడీవో పాల్గొని పారిశుద్ధ్యం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామ సభలు నిర్వహించడం వల్ల ఏ ళ్ల తరబడి పేరుకుపోయిన ప్రధాన సమస్య లు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. గ్రామ సభలల్లో ప్రధానంగా రోడ్లు, మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ స్తంభాల మరమ్మతులు, ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు. గ్రామ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజు, సర్పంచ్ లు ఎరుకల శేఖర్, బద్దం హరిత కృష్ణారెడ్డి, మల్లికార్జున్, మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీష్, ఏపీవో నాగభూషణం, పంచాయతీ కార్యదర్శిలు రియాజ్, సత్యనారాయణ, ఏఎన్‌ఎం ధనలక్ష్మి, వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.






