12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు సింగరేణి జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది.
అవి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులను వేలం వేయడం వల్ల సింగరేణి సంస్థతో పాటు లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించాలని, కోయగూడెం ఓసీ-3 బొగ్గు గనిని కూడా సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడ్డాయని విమర్శించారు. సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు బ్లాకులను వేలం వేస్తోందని అన్నారు.
ఈ విధానం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడటమే కాకుండా కార్మికుల ఉపాధి భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులు, శ్రమ చట్టాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.






