తిరుమల కొండలపై విత్తనాలు చల్లిన చిన్నారి నైనిక
నాడు ఆక్సిజన్ మాస్క్ తో నేడు విత్తనాలు వెదజల్లుతూ
పుట్టినరోజు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం
కొత్తగూడెం,(విజయక్రాంతి): చిన్న వయసులోనే ప్రకృతి పరిరక్షణకై సంకల్పించి... ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, తనవంతు కృషి చేస్తోంది. కొత్తగూడెంకు చెందిన నైనిక రజువా. ప్రకృతి హరిదీక్షబూని పచ్చదనాన్ని భావితరాలకు అందించాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. కొత్తగూడెం సెయింట్ మేరీస్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నైనిక రజువా ‘విత్తనాలు నాటాలి.. మొక్కలను పెంచాలి.. పంచాలి.. పర్యావరణాన్ని పరిరక్షించాలి..’ అనే నినాదాలతో ప్రకృతిని కాపాడుటకు నడుం బిగించింది.
సింగరేణియన్, మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోడీచే ప్రశంసలు అందుకున్న మొక్కల రాజశేఖర్ వద్ద ప్రకృతి హరిత దీక్ష తీసుకున్న నైనిక ఇప్పటివరకు వందలాది మొక్కలు నాటడంతోపాటు వేలాది మొక్కలను బహుమతిగా అందిస్తూ ప్రకృతి పరిరక్షణపై ప్రచారం చేస్తోంది. తిరుమల కొండల్లో విత్తనాలు చల్లుతూ.. భిన్నంగా పుట్టినరోజు వేడుకలు, జరుపుకుని అటు ఆధ్యాత్మికతను, మరోవైపు ప్రకృతిపై తనకు ఉన్న ప్రేమను చాటిచెప్పింది.
పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వరస్వామి ని దర్శించుకునేందుకు తల్లిదండ్రులు దశరథ్ రజువా, ఝాన్సీ రాణిలతో కలిసి వెళ్లిన నైనిక రజువా అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల కొండకు చేరుకుంది. నడక మార్గంలో తాను గత కొన్నాళ్లుగా సేకరించిన పలు రకాల పండ్ల విత్తనాలను చల్లుతూ వెళ్లింది. వర్షాకాలం కావడంతో చల్లిన విత్తనాలు మొలకలు వచ్చి చెట్లుగా పెరిగి భవిష్యత్తులో అక్కడి అటవీ జంతువులకు అవసరమైన పండ్లను అందించి వాటి ఆకలి తీర్చడానికి విత్తనాలను చల్లిన నైనికను నడకమార్గంలో వెళ్లే భక్తులు అభినందించారు.
వర్షాకాలంలో సమీపంలోని అడవుల్లో వాటిని చల్లడం ద్వారా కోతులు, ఇతర వన్యప్రాణుల ఆకలి తీర్చుకునేందుకు అవసరమైన పండ్లు దొరుకుతాయని నైనిక అవగాహన కల్పించింది. ప్రకృతి ఉంటేనే మనం ఉంటామని, తనలాంటి భావితరాలకు పచ్చని భవిష్యత్తు అందించాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలని నైనిక పిలుపునిచ్చింది. గతంలో పర్యావరణ పరిరక్షణపై తిరుమల తిరుపతిలో ఆక్సిజన్ మాస్క్ ధరించి సందేశం ఇచ్చిన నైనిక.. ఇప్పుడు తిరుమల కొండలపై విత్తనాలు చల్లుతూ తన ప్రత్యేకతను చాటుకుంది.






