29 July, 2026 | 4:03 PM

రాష్ట్ర స్థాయి క్రీడలకు డీఏవీ విద్యార్థుల ఎంపిక

29-07-2026 03:14 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని డీఏవీ మిధానీ పాఠశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించిన డీఏవీ క్లస్టర్ లెవల్ స్పోర్ట్స్ మీట్ లో సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన డీఏవీ లక్ష్మీపత్ సింఘానియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు  ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి మొత్తం 34 మంది విద్యార్థులు ఆరు క్రీడా విభాగాల్లో పాల్గొనగా, 12 స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్య పతకాలు సాధించారు. 15 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

అండర్-14 బాలికల హ్యాండ్‌బాల్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, కరాటే అండర్-14 లో 30–34 కిలోల బరువు విభాగంలో కాంస్య పతకం, 34–38 కిలోల బరువు విభాగంలో రజత పతకం సాధించి పాఠశాలకు మరింత పేరు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అంబదాస్ రావు మాట్లాడుతూ... విద్యార్థులు క్రీడల్లో కనబరిచిన ప్రతిభ పాఠశాలకు గర్వకారణమని అన్నారు. విద్యతో పాటు క్రీ డలలోనూ రాణించేలా పాఠశాల ప్రత్యేక శిక్షణ అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 15 మంది విద్యార్థులు మరింత మెరుగైన ప్రతిభ చూపి జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు.