23 May, 2026 | 1:49 AM

జోరందుకున్న డబ్బా వాగు వంతెన పనులు

23-05-2026 12:42 AM

మునిపలి, మే 22 : ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో రహదారులు, వంతెనల పనుల్లో స్పీడ్ పెంచారు.  ఇందుల భాగంగానే తక్కడపల్లి - గార్లపల్లి, పిల్లోడి - బోడపల్లి గ్రామాల మధ్య ఉన్న డబ్బా వాగుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వంతెనల కోసం కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది.

కానీ  తక్కడపల్లి - గార్లపల్లి బ్రిడ్జి మాత్రం పిల్లర్ల మధ్యలోనే ఆగిపోగా..ఇక పిల్లోడి- బోడపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి  పిల్లర్ల మధ్యలోనే  పనులు నిలిచిపోయాయి. దీంతో ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడేవారు. ఈ  విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ్మ దృష్టికి ఆయా గ్రామాల నాయకులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని 2025 ఆగస్టు 22న ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. 

డబ్బా వాగుపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జిల పనులు త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆదేశాలు జారీ చేశారు. కాగా పిల్లోడి-బోడపల్లి గ్రామాల మధ్య డబ్బా వాగుపై రూ.3.5కోట్లతో  నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి.  ఈ వంతెన  జూన్లో వర్షాకాలం నాటికి పూర్తి  కానుంది.

ఇక మిగిలింది తక్కడపల్లి - గార్లపల్లి వంతెన పనులు కూడా జోరుగా  కొనసాగుతున్నాయి. వంతెన అక్టోబర్ వరకుఎలాగైనా  పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్, అధికారు లను మంత్రి ఆదేశించారు. ఏది ఏమైనప్పటికీ డబ్బా వాగుపై నిర్మిస్తున్న రెండు వంతెనలు పూర్తి అయితే దూర భారం తగ్గి రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా ఉంటుందని పలువురు అంటున్నారు.