1 September, 2026 | 4:47 PM

తాగునీటి కోసం రోడ్డెక్కిన కందనెల్లి తండా వాసులు

01-09-2026 04:30 PM

తాండూరు - సంగారెడ్డి మధ్య గంట పాటు నిలిచిపోయిన రాకపోకలు

దురుద్దేశంతోనే నాపై బురదజల్లేందుకు ఆందోళన

తాండూరు,సెప్టెంబర్ 1,(విజయక్రాంతి), వికారాబాద్ జిల్లా పెద్దెముల మండలం కందనెల్లి తండాలో గత పది రోజుల నుండి తాగునీటి కోసం అల్లాడుతున్నామని.. తాగునీటి ఏర్పాటు చేయాలంటూ మంగళవారం తండావాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సర్పంచ్‎కు తాగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో తాండూరు సంగారెడ్డి జిల్లా మధ్య రాకపోకలు దాదాపు గంటసేపు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో తిరుమల స్వామి ఘటనా స్థలానికి చేరుకుని మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో గత రెండు రోజుల నుండి మరమ్మతులు చేస్తున్నామని రేపటి వరకు తాగునీరు అందుబాటులో వస్తుందని అన్నారు. 

ఈ విషయమై సర్పంచ్ ఆనంద్ నాయక్ మాట్లాడుతూ.. దురుద్దేశంతో నాపై బురదజల్లేందుకు కొంతమంది వాలంటరీలు ఆందోళన చేశారని.. కేవలం రెండు రోజుల నుండి మాత్రమే త్రాగునీటిలో మరమత్తు కారణంగా జాప్యం జరిగిందని.. ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశామని... అనవసరంగా రోడ్లుపై ఎక్కి ఆందోళన చేయడం సరికాదని.. నిత్యం ప్రజల మధ్య ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నానని..ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.