4 April, 2026 | 3:18 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

కోట్ల కొద్దీ నగదు.. కిలోల కొద్దీ బంగారం

11-10-2025 12:02 AM
  1. ఫామ్‌హౌస్‌లో 17 టన్నుల తేనె నిల్వలు
  2. ఆయన విలాస జీవితం చూసి విస్తుపోయిన అధికారులు
  3. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

భోపాల్, అక్టోబర్ 10:  మధ్యప్రదేశ్‌లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఇంజినీర్ ఇళ్లలో సంపద చూసి అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీపీ మెహ్రా బంగ్లాలు, ఇతర ఆస్తులపై గురువారం అధికారులు జరిపిన సోదాల్లో కుప్పలుతెప్పలుగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

నగదు, బంగారం మాత్రమే కాదు, ఏకంగా 17 టన్నుల తేనె నిల్వలను చూసి అధికారులు విస్తుపోయారు.ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో లోకాయుక్త డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో బృందాలు ఏకకాలంలో భోపాల్, నర్మదాపురంలోని నాలుగు ప్రాంతాల్లో దాడులు ప్రారంభించాయి. భోపాల్‌లోని మణిపురం కాలనీలో ఉన్న మెహ్రా నివాసంలో రూ.8.79 లక్షల నగదు, సుమారు రూ.50 లక్షల విలువైన ఆభరణాలు, రూ.56 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను గుర్తించారు.

సమీపంలోని ఓపల్ రీజెన్సీ అపార్ట్‌మెంట్‌లోని మరో ఇంటిలో సోదాలు చేయగా, రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి లభించాయి. లభించిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లను వినియోగించాల్సి వచ్చింది.అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం నర్మదాపురం జిల్లా సోహాగ్పూర్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసింది. అక్కడ అధికారులు ఏకంగా 17 టన్నుల తేనె నిల్వలను కనుగొన్నారు.

అంతేకాకుండా, అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, ఇప్పటికే పూర్తయిన ఏడు కాటేజీలు, ఆరు ట్రాక్టర్లు, చేపల పెంపకానికి ఓ చెరువు, గోశాల, ఒక గుడి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్, మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.మెహ్రా బినామీ సంస్థగా భావిస్తున్న గోవింద్పురాలోని కేటీ ఇండస్ట్రీస్లోనూ సోదాలు జరిపి, రూ.1.25 లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం మీద ఇప్పటివరకు రూ.36 లక్షలకు పైగా నగదు, 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండితో పాటు పలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పత్రాలు, షేర్ డాక్యుమెంట్లను గుర్తించినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు.

ఆస్తుల విలువ ఇంకా లెక్కిస్తున్నామని, దీని విలువ అనేక కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయని, మెహ్రా ఆర్థిక లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు.