మైనార్టీ సంక్షేమానికి 3,591 కోట్లు
గత బడ్జెట్‌కంటే 178 కోట్ల పెంపు
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.3,769 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.3,591 కోట్లుగా ఉండగా, ఈసారి రూ.178 కోట్లు అదనంగా పెరిగింది. శాతాల పరంగా చూస్తే సుమారు 4.95 శాతం పెరుగుదల నమోదైంది. గతంతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదలగానే కనిపిస్తున్నప్పటికీ, సంక్షేమ కార్యక్రమాల విస్తరణ దృష్ట్యా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వం ఈ నిధులను ప్రధానంగా విద్యా సహాయం, స్కాలర్‌షిపులు, విదేశీ విద్య పథకాలు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, మసీదు అభివృద్ధి వంటి అంశాలకు వినియోగించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పెరుగుదల అవసరాలకు తగినంత లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మైనారిటీ వర్గాల జనాభా, వారి ఆర్థికసామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, మరింత గణనీయమైన కేటాయింపులు అవసరమని వారు సూచిస్తున్నారు. గతంలో ప్రకటించిన పథకాల అమలు కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం మరో సవాల్‌గా ఉంది.




