2 May, 2026 | 1:57 AM

మోడీ కార్మిక వ్యతిరేకి

02-05-2026 12:38 AM

సీపీఐ నేత డా. కె. నారాయణ

ఖమ్మంలో సీపీఐ మేడే భారీ ప్రదర్శన

ఖమ్మం, మే 1 (విజయక్రాంతి): ప్రపంచ వ్యాప్తంగా అనేక పోరాటాలకు మేడే స్ఫూర్తిగా నిలిచిందని ఆ స్ఫూర్తి అనేక విజయాలకు నాంది పలికిందని సిపిఐ జాతీయ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ కె. నారాయణ తెలిపారు. అనేక దశాబ్దాల పాటు వీరోచిత పోరాటాలతో సాధించుకున్న హక్కులు ఇప్పుడు హరించబడుతున్నాయని ఆయన ఆరోపించారు.

141వ మేడేను పురస్కరించుకుని శుక్రవారం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ లోని పాత సిపిఐ కార్యాలయం నుండి పెవిలియన్ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. వైరారోడ్డు, పాత బస్టాండ్ మీదుగా ప్రదర్శన పెవిలియన్ మైదానంకు చేరుకుంది. సిపిఐ జిల్లా కాద్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ శ్రమ దోపిడీ పెరుగుతుందని కార్పొరేట్ వర్గాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను సవరించడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. 

శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మరో చారిత్రిక పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా పనిచేస్తున్న మోడీకి పాలనపై పట్టు లేదని అసలు పాలనే లేదని అంతా కార్పొరేట్ సేవ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయలు బ్యాంకులకు ఎగవేసి విదేశాలలో కులుకుతున్న వారిని వదిలేసి నష్టాల పేరుతో బ్యాంకులను విలీనం చేస్తున్నారని నారాయణ తెలిపారు.  నాలుగు రేట్లు, 40 మంది దొంగలు బ్యాంకులకు ఎగవేశారని దీనిపై మోడీ స్పందించరన్నారు.

మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కేవలం అటవీ ఖనిజ సంపదను కొందరికి కట్టబెట్టేందుకు మాత్రమే జరిగిందన్నారు. జమిలీ ఎన్నికలపై ప్రధాన మోడీ దృష్టిసారించే అవకాశం ఉందన్నారు. జన చైతన్యమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కవిత వ్యవహారం కేసిఆర్ కుటుంబ వ్యవహారమని కేసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ను పక్కనపెట్టి తెలంగాణ వ్యతిరేకులకు అవకాశం కల్పించారని నారాయణ తెలిపారు. బిజెపి వ్యతిరేకులు చేస్తే తప్పు అనుకూలూరు చేస్తే ఒప్పు అన్న చందంగా మోడీ టీమ్ పని చేస్తుందన్నారు.

తమిళనాడులో చంద్రబాబు కమ్యూనిస్టులను విమర్శించడం సరికాదని కమ్యూనిస్టులు లేని సమాజాన్ని చూడటం ఎవరి తరం కాదన్నారు. ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా లు ప్రసంగించగా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ కె జానిమియా, మహ్మద్ సలాం, అజ్మీర రామ్మూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, ఏఐటియుసి అధ్యక్ష, కార్యదర్శులు గాదె లక్ష్మి నారాయణ, తోట రామాంజనేయులు, సిపిఐ నాయకులు పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, మిడికంటి వెంకటరెడ్డి, సీతామహాలక్ష్మి, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు నానబాల రామకృష్ణ. ఇటికాల రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు తాటి నిర్మల, జాకీర్, సైదా, వరదా నర్సింహారావు  పాల్గొన్నారు.