ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్
సిద్దిపేట క్రైం: ధాన్యం కొనుగోలు, రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియలు సజావుగా సాగేందుకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తూ, అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధాన్యం అన్‌లోడింగ్ జరుగుతున్న రైస్ మిల్లులను పరిశీలిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాలు, రవాణా మార్గాల వద్ద పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ, సివిల్ సప్లైస్, ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ పలు కొనుగోలు కేంద్రాలు, రవాణా మార్గాలు, రైస్ మిల్లులను స్వయంగా సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.






