దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్
- ముగ్గురు నిందితుల అరెస్ట్
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): లక్షెట్టిపేటలో కలకలం సృష్టించిన నకిలీ నోట్ల చలామణి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వివరాలను వెల్లడించారు. నకిలీ నోట్ల చలామణి కేసులో గతంలో 12 మందిని అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారన్నారు. పరారీలో ఉన్న కోదండరావు (కాకినాడ), రవి (పశ్చిమ గోదావరి జిల్లా), శ్రీనివాస్ (గోదావరిఖని) లను ఇటిక్యాల సమీపంలో సిఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ బృందం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారన్నారు.
నిందితుల వద్ద నుంచి 61,000 రూపాయల విలువ గల 500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని, వీటితో పాటు నేరానికి ఉపయోగించిన నాలుగు సెల్ ఫోన్లను కూడా జప్తు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనునట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.




