13 August, 2026 | 3:48 PM

ఉప్పల్ భగాయత్‌లో కార్డన్ సెర్చ్

13-08-2026 02:32 PM

100 మద్యం బాటిళ్లు స్వాధీనం

26 బైకులు, 5 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం

242 మందిపై కేసులు

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ భగాయత్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో పలు అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలు, అద్దె గదులు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి, డీవీ రవికుమార్, అడిషనల్ ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. తనిఖీల్లో 7 మంది ఇన్‌ఫార్మర్ షీటర్లు, 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వివిధ నిబంధనలు ఉల్లంఘించిన 242 మందిపై కేసులు నమోదు చేసి, 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే 100 మద్యం బాటిళ్లు, 5 ఎల్పీజీ సిలిండర్లు పట్టుకుని స్వాధీనం చేశారు.ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉప్పల్ భగాయత్ పరిధిలో ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.