సిరిసిల్ల కవికి తెలుగు వర్సిటీ ప్రతిష్ఠాత్మక సాహితీ పురస్కారం
‘శ్రీమద్రామాయణం’కు 2024 సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం
శశికిరణ్ కొమాండూరుకు సాహితి ప్రతిష్టాత్మక అవార్డు
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ కవి, తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ, సీనియర్ గ్రూప్-1 అధికారి శశికిరణ్ కొమాండూర్ రచించిన పద్య మహాకావ్యం ‘శ్రీమద్రామాయణం’ ప్రతిష్ఠాత్మక 2024 సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైంది. పరిపాలనా బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత రెండు దశాబ్దాలుగా సాహిత్య సాధన కొనసాగిస్తున్న శశికిరణ్ కొమాండూర్.. సామాన్య పాఠకుడికి సైతం సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో, ఛందోబద్ధంగా ‘శ్రీమద్రామాయణం’ను రచించారు.
ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో ఈ మహాకావ్యాన్ని ప్రచురించింది. సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, వ్యక్తిగత జీవితంలోనూ నైతిక విలువలు, నిజాయితీకి ప్రాధాన్యమిచ్చే అధికారిగా శశికిరణ్ కొమాండూర్‌కు సహచర అధికారుల్లో మంచి గుర్తింపు ఉంది. గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కోసం ఆయన పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ, అప్పట్లో తాను సంబంధిత కేంద్ర మంత్రి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నందున, పదవిలో ఉన్న సమయంలో తన శాఖకు సంబంధించిన పురస్కారాన్ని స్వీకరించడం నైతికంగా సముచితం కాదని భావించి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు.
నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న శశికిరణ్ కొమాండూర్‌కు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం లభించడం పట్ల కవులు, రచయితలు, సాహితీవేత్తలు, ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
లోక్ భవన్‌లో ఘన సత్కారం
తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైన శశికిరణ్ కొమాండూర్‌ను లోక్ భవన్‌లో గ్రూప్-1 అధికారుల సంఘం, లోక్ భవన్ అధికారులు ఘనంగా సత్కరించారు. గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, గవర్నర్ ఉప కార్యదర్శి జి. పల్లవి, ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం, సమన్వయ అధికారి మురళీచార్యులు, అకౌంట్స్ ఆఫీసర్ శైలజ, అసిస్టెంట్ కంప్ట్రోలర్ జెడ్. హెరాల్డ్ డేవిడ్, ఉద్యానవన అధికారిణి మాలిని, డీఈఈ శ్రీధర్, సెక్షన్ ఆఫీసర్ ఎస్. రామచంద్రం, సాంఖ్యక అధికారి శ్రీకాంత్, ఏఈఈలు హర్షవర్ధన్, త్రిష తదితరులు శశికిరణ్ కొమాండూర్‌ను సత్కరించి అభినందించారు.
లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రత్యేకంగా శశికిరణ్ కొమాండూర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామం నుంచి సాహిత్య రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దిశగా సాగుతున్న శశికిరణ్ కొమాండూర్‌కు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం పట్ల స్వగ్రామం, జిల్లా వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.






