అందుకే ఫైనల్ వేదిక మార్పు
10 వేల టికెట్లు అడిగారన్న బీసీసీఐ
ముంబై, మే 7 : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పు దుమారం రేపుతోంది. సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ హోంగ్రౌండ్‌లోనే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంను కాదనీ బీసీసీఐ అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ నిర్వహించబోతోంది. దీనిపై తాజాగా బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఎందుకు వేదికను మార్చాల్సి వచ్చిందో స్పష్టం చేసింది.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో కాంప్లిమెంటరీ టికెట్లను డిమాండ్ చేయడంతో వేదికను మార్చాల్సి వచ్చిందని బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా తెలిపారు. ‘ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్టేడియం మొత్తం సీటింగ్ సామర్థ్యంలో కేవలం 15 శాతం మాత్రమే ఆతిథ్య సంఘానికి కాంప్లిమెంటరీ టికెట్లు అందించాల్సి ఉంటుందన్నారు. అయితే, ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల సమయంలోనే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ 15 శాతాన్ని మించి చాలా ఎక్కువ మొత్తంలో కాంప్లిమెంటరీ టిక్కెట్లను క్లెయిమ్ చేస్తోందని తమకు సమాచారం వచ్చిందన్నారు.
దీనిపై కచ్చితమైన వివరాలను కోరుతూ తాము వారికి ఈమెయిల్ పంపామనీ, కేఎస్‌సీఏ నుంచి సమాధానం కూడా వచ్చిందన్నారు. 15 శాతం కాంప్లిమెంటరీ టికెట్ల కోటాకు అదనంగా తమ సభ్యులు, అనుబంధ క్లబ్‌లు, ఇతర వర్గాల కోసం భారీ సంఖ్యలో అదనపు టికెట్ల కేటాయింపు అవసరమని అందులో పేర్కొన్నట్టు తెలిపారు. ఆశ్చర్యకరంగా వారు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా టికెట్లు కావాలని కోరారనీ వెల్లడించారు. ఓవరల్‌గా 15 శాతం కోటాకు మించి సుమారు పదివేల టికెట్లు డిమాండ్ చేస్తున్నారన్నారు.






