30 June, 2026 | 3:12 AM

ప్రభుత్వ పాఠశాలకు తాళం..!

30-06-2026 12:00 AM

పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ నిరసన

ఖమ్మం, జూన్ 29 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన ఘటన ఖమ్మం నగరంలో సోమవారం కలకలం రేపింది.

ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.26 లక్షల వ్యయంతో మైనర్ వరక్స్ పనులను కాంట్రాక్టర్ అయోధ్య చేపట్టారు. ఇందులో రూ.13 లక్షల బిల్లులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా బిల్లులు విడుదల కాకపోవడంతో సంబంధిత జిల్లా అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదని కాంట్రాక్టర్ ఆరోపించారు.

దీంతో సోమవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారానికి తాళం వేసి, పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించే వరకు తాళం తీయబోనని అక్కడే నిరసనకు దిగారు. పాఠశాల ప్రారంభ సమయానికి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది లోపలికి వెళ్లలేక కొంతసేపు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ నిరసనతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.