calender_icon.png 15 February, 2026 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలంలో నిరంతరాయంగా దర్శనం

15-02-2026 12:31:09 AM

  1. లక్షలాది మంది భక్తులకు ఏర్పాట్లు పూర్తి
  2. మహాశివరాత్రి సందర్భంగా నిర్ణయం  
  3. జిల్లా కలెక్టర్ రాజకుమారి 

నాగర్ కర్నూల్ / శ్రీశైలం, ఫిబ్రవరి 14 ( విజయక్రాంతి ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రంలో మల్లన్న స్వామివారి నిరంతరాయ దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసి అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

శనివారం ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలిసి శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, కళ్యాణ కట్ట, పాతాళగంగ, భద్రతా ఏర్పాట్లు, ప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. భక్తులు సులభంగా, వేగంగా దర్శనం పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు.

అటవీ మార్గంలో పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం తాగునీరు, అన్నదానం, వైద్య సేవలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.భక్తుల పట్ల ఎవరైనా అధికారులు ఇతర ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా లేదా అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

దేవాదాయ శాఖ కమిషనర్, డీఐజీ పరిశీలన  

శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికా దేవి దర్శనార్థం లక్షల మంది భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.