30 May, 2026 | 2:40 AM

ఉచిత విద్యుత్ ఎత్తివేతకు కుట్ర

30-05-2026 01:47 AM
  1. ‘రైతు డిస్కం’ రైతు ప్రయోజనాలకు కాదు  
  2. విద్యుత్ రంగాన్ని విభజించి ప్రైవేటీకరించే ఉద్దేశం
  3. ప్రభుత్వం తన ప్రతిపాదన విరమించుకోవాలి  
  4. ఈఆర్సీ ముందు బీఆర్‌ఎస్ వాదనలు 
  5. హాజరైన మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక రైతు డిస్కం ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతన్నలకు అందుతున్న 24 గంటల ఉచిత విద్యుత్‌నును రద్దు చేసేందుకే రైతు డిస్కం ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చిందని మండిపడింది.  శుక్రవారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున ఆధ్వర్యంలో రైతు డిస్కం ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో రైతు డిస్కం తరఫున సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పాల్గొన్నారు. రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ముందు బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగ్‌రెడ్డి నిరంజన్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ‘రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ‘ రైతుల ప్రయోజనాల కోసం కాదని, వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను ఎత్తివేసి, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగమని ఆరోపించారు. రైతు డిస్కం పేరుతో ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతులను చీకట్లలోకి నెట్టే ‘ఉరి డిస్కమ్‘గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు? 

ఈఆర్‌సీ ముందు వాదనలు వినిపించిన అనంతరం మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో రైతులకు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని గుర్తు చేశారు. 2017లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రారంభించి, ఐదేళ్లపాటు అంతరాయం లేకుండా అమలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న మూడో డిస్కం ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందన్నారు.

రెగ్యులర్ ఆదాయం వచ్చే వినియోగదారులను ఒకవైపు, సబ్సిడీ పొందే రైతు కనెక్షన్లను మరోవైపు వేరు చేసి, భవిష్యత్తులో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడమేనని ఆరోపించారు. ఇది విద్యుత్ వ్యవస్థను విభజించి రైతులను ఒంటరిగా చేసే ప్రమాదకర చర్య అని పేర్కొన్నారు.

విద్యుత్ రంగంలో ఏ విధమైన నిర్మాణాత్మక మార్పు చేయాలన్నా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి తప్పనిసరి అన్నారు. కానీ, ఈఆర్‌ఎసీ అనుమతి రాకముందే సీఎం రేవంత్‌రెడి మూడో డిస్కం ప్రారంభ తేదీని ప్రకటించడం నియంత్రణ సంస్థల అధికారాలను అవమానించడమేనని విమర్శించారు. ఈ అంశాన్ని కూడా ప్రజా విచారణలో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రభుత్వం మూడో డిస్కమ్ అవసరాన్ని సమర్థించేందుకు చెబుతున్న కారణాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. 

రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం

రైతుల పేరుతో విద్యుత్ చౌర్యాలు జరుగుతున్నాయని ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రైతాంగాన్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపై మోపిన ముద్రను ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పునరావృతం చేస్తోందని విమర్శించారు. ఈ కొత్త వ్యవస్థ అమలైతే ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్న విద్యుత్ సేవలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.

ప్రస్తుతం ఉన్న లైన్‌మన్లు, ఫీల్డ్ సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, ఒక మండలానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే లైన్‌మన్లు ఉండే పరిస్థితి వస్తుందని చెప్పారు. వేలాది వ్యవసాయ కనెక్షన్లు, వందలాది ట్రాన్స్‌ఫార్మర్ల  బాధ్యత ఒక్కరి భుజాలపై పడుతుందని, దీంతో విద్యుత్ అంతరాయాలు ఎదురైనప్పుడు రైతులకు వెంటనే సేవలు అందకపోయే ప్రమాదం ఉందన్నారు. అదే విధంగా రైతులకు ప్రస్తుతం ఉన్నట్లుగా సబ్‌స్టేషన్ల వద్ద అధికారులను నేరుగా సంప్రదించే అవకాశం ఉండదన్నారు.

మూడో డిస్కం ప్రతిపాదన రైతుల ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకమని, ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈఆర్‌ఎస్ ముందు తమ అభ్యంతరాలను నమోదు చేశామని, రాతపూర్వకంగా సమర్పించినట్లు వెల్లడించారు. రైతాంగం అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ చర్యలపై పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.