25 May, 2026 | 4:24 AM

మోటార్లకు మీటర్ల వెనుక కుట్ర

25-05-2026 12:37 AM
  1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తేసే ప్రయత్నం
  2. మీటర్లు పెట్టకముందే కాంగ్రెస్ ఫీజులు పీకేయండి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర ఉందని, సేద్యానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాకుండా ఇళ్లలో ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని.. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేసి ఆదాని, అంబాని వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

మూడు నెలల్లో ఉన్న మీటర్లు తొలగించి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నారని, ఆ లోపే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆదివారం అంబర్‌పేట్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పోతుందని ఎన్నికల ముందే ప్రజలను బీఆర్‌ఎస్ హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణం అన్నారు.

ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా, రూ.30 వేల కోట్ల రుణం ఆపినా కేసీఆర్ ఎదిరించారని పేర్కొన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడమే కాకుండా.. అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్వరలో సభ్యత్వ నమోదు ఉంటుందని, ఆ తరువాత కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.  ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈసారి సభ్యత్వం డిజిటల్ విధానంలో ఉంటుందని కేటీఆర్ తెలిపారు.  

ప్రజా సమస్యలపై పోరాడిన వారికే టికెట్లు

ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసిన వారికే గ్రేటర్ హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని, సర్వే నివేదికలను కూడా ప్రామాణికంగా తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో ఒక్క ఇళ్లు కట్టలేదని, పైగా హైడ్రా పేరుతో ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు.

ఉన్న నగరాన్ని పట్టించుకోవడం చేతగాని ముఖ్యమంత్రి..  ఫ్యూచర్ సిటీ పేరుతో  పోజులు కొడుతున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే గత ప్రభుత్వం మూసీపై ఎస్టీపీలు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టిందని, ఇప్పుడు మళ్లీ మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఎందుకని, లక్ష కోట్ల కోసమేనా? అని ప్రశ్నించారు.