calender_icon.png 7 February, 2026 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ జయకేతనం ఖాయం

07-02-2026 12:05:50 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

షాద్‌నగర్, ఫిబ్రవరి ౬ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ షాద్నగర్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మున్సి పల్‌లోని 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అందె మోహన్ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మహిళలతో ’రచ్చబండ’ నిర్వహించి, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు.

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను వైద్య రంగానికి ’సౌత్ సెంట్రల్’గా తీర్చిదిద్దుతామని, గాంధీ, ఉస్మానియా తరహాలో 32 విభాగాలతో జిల్లా ఆస్పత్రులను ఆధునీకరించి అత్యవసర సేవలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

జాతీయ రహదారులపై ప్రమాద బాధితుల కోసం 200 పడకల ఆస్పత్రులు, 8 నిమిషాల్లోనే అందుబాటులోకి వచ్చే అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్టం లో 80 డయాలసిస్ సెంటర్లు, డయాబెటిక్ సెంటర్లు మరియు ఉమా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

సంక్షేమమే గెలిపిస్తుంది

గడిచిన రెండేళ్లలో అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, మహిళా రుణాలు, మరియు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలు కాంగ్రెస్కు 75-80% విజయాన్ని అందిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓటర్లు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.