calender_icon.png 20 February, 2026 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మూసీ పాలే!

20-02-2026 01:22:15 AM

ఒక్కో మంత్రి అవినీతి చిట్టా బయటపెడతాం

  1.   2029లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండదు
  2. రూ. 2.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయాయి?
  3. మజ్లీస్ కోసమే భాగ్యనగరాన్ని మూడు ముక్కలు చేశారు
  4. బీఆర్‌ఎస్ బరితెగించి కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది
  5. చేరికల సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్
  6. భవిష్యత్ బీజేపీదే: పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): 2029లో తెలంగాణతోపాటు ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండదని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొ న్నారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఒక్కో మంత్రి అవినీతి చిట్టా బయటపెడతామని, అవినీతికి సంబంధించిన ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 2.18 లక్షల కోట్లు పెట్టుబడులు ఎక్కడికి పోయాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించా రు.

మజ్లీస్ పార్టీ కోసమే భాగ్యనగరాన్ని సీఎం మూడు ముక్కలు చేశారని, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆ ర్‌ఎస్, మజ్లీస్ చెంపచెల్లుమనిపించామని చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకే ఈ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని, బీఆర్‌ఎస్ బరితెగించి కాంగ్రెస్‌తో కుమ్మక్కైంద ని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్‌రావు, కేంద్రమంత్రి బండి సంజ య్ సమక్షంలో బీజేపీలో చేరిన 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్యను రాంచందర్ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాంచందర్ రావును ఈమేరకు కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సహకారం మరువలేనిద న్నారు. ప్రజలు ఆశీర్వదించి మెజారిటీ సీట్లు ఇస్తే.. మేయర్ పదవి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు చేసిన కుట్రలకు ధీటుగా చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు రామచంద్రరావు సలహాలు, సూచనలిచ్చారని తెలిపా రు.

బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం కాంగ్రెస్‌తో కలిసివెళ్లాలని, మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికే ఓటేయాలని చెప్పినా...ప్రజాతీర్పు ను గౌరవిస్తూ అగ్రనాయకత్వాన్ని ధిక్కరించిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు అభినందన లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? లేదా? ఆ పార్టీ నేతలకు అర్ధం కావడం లేదని విమర్శించారు. ఏ పార్టీ మద్ద తు లేకుండా స్వయంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను బీజేపీ కైవసం చేసుకుందని, ఇదే స్పూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేస్తామన్నారు.

70 లక్షల జనాభాలో 30 లక్షలకుపైగా జనాభా ముస్లింలే ఉన్నారని, ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుం డా, అఖిలపక్షం మీటింగ్ లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా జీహెచ్‌ఎంసీని విభజించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి.. జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, బీజేపీకి భయపడి హిందూ సమాజ ఓట్లను చీల్చడానికే జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేశారన్నారు.

కోటిన్నర జనాభా, 40 వేల కోట్ల బడ్జెట్ కలిగిన ముంబై కార్పొరేషన్‌ను విభజించలేదని, రెండు కోట్ల జనాభా కలిగిన ఢిల్లీని విభజించలేదని, చెన్నై కార్పొరేషన్‌ను చీల్చలేదు.. మరి జీహెచ్‌ఎంసీని ఎందుకు ముక్కలు చేశారు? అని ప్రశ్నించారు. మొద్దు శ్రీను బావ కళ్లలో ఆనందం చూసేందుకు హత్య చేసినట్లుగా.. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసం జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేశారని విమర్శించారు. 

కరప్షన్.. కమీషన్.. కలెక్షన్

టీపీసీసీ కాదు అది.. టీ4సీ.. తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్, కాంగ్రెస్ అని ఆరో పించారు. భాగ్యనగర్‌లో కాంగ్రెస్‌ను మూసీ నదిలో పడేయడం ఖాయమని, దిమ్మతిరిగే విధంగా కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. భాగ్యనగర్ ప్రజలారా.. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను రెండేళ్లలో చేసిందేమిటో చెప్పాలని నిలదీయండని కోరా రు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే పరిమితమవుతున్నారే తప్ప తెలం గాణకు చేసిందేమిటో చెప్పాలి? అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వారి ఉసురు తీసుకుంటున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తున్న వృద్ధులను గుంజుకుపోయి జైల్లో వేయడానికి సిగ్గు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రుల అవినీతి చిట్టా విప్పుతాం..

రాష్ట్ర మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నారని, మంత్రుల అవినీతికి కొంద రు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారని, అతి త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టా, ఐఏఎస్ అధికారుల దందాలన్నీ బయటపెడతామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులారా.. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరేదాకా బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతోందన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ర్టంలోనూ కాంగ్రెస్ పాలన ఉండదని పేర్కొన్నారు. మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి బీజేపీని అడ్డుకోవాలనుకుం టే.. మీ సంగతి చూస్తామని హెచ్చరించారు. 

మోదీ ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి..

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టారని, మంత్రుల మెడలు వంచు తాం.. 6 గ్యారంటీలు అమలయ్యేలా చేస్తామని ఆయన తెలిపారు. భాగ్యనగర్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే.. మోదీ ప్రభుత్వ నిధులే శరణ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాషాయ జెండాను ఎగరేయబోతున్నామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ బలపడుతోంది: రాంచందర్‌రావు

రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, సీఎంకు ఢిల్లీకు వెళ్లడం తప్ప మరో ధ్యాసే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణ చరిత్రలో స్వతహాగా తొలిసారి కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందని, ఇందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. కొమరయ్య కార్పొరే టర్‌గా ఎన్నికై బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ సిద్దాంతాలు, మోదీ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతోందన్నారు.

రాష్ర్టంలో పరిపాలనను గాలికి వదిలేశారని, రాష్ర్టంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలు రాగానే హామీలి చ్చి ప్రజల్ని రేవంత్ సర్కారు మోసం చేస్తుందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రెండేళ్లుగా బెన్ ఫిట్స్ రాకపోవడంతో 60 మంది చనిపోయారని, విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్ఠు పట్టిస్తున్నారని, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వ తప్పిదాలనే కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందన్నారు. తెలంగాణకు కరీంనగర్ గుండెకాయ.. ఉద్యమాల గడ్డ అని, అలాంటి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవ సం చేసుకోవడమంటే భవిష్యత్ తెలంగాణ బీజేపీదేనని అర్థం చేసుకోవాలన్నారు.

ప్రజలు తిరగబడే రోజులొస్తాయి..

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జీహెచ్‌ఎం సీ పరిధిలో తట్ట మొరం పోసిన దాఖలాల్లేవ్ అని, భాగ్యనగర్ ప్రజలంతా తిరగబడే రోజులు రాబోతున్నయ్.. అని బండి సంజ య్ హెచ్చరించారు. తెలంగాణ రైజింగ్ పేరుతో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కదా?.. ఆ డబ్బుల న్నీ ఎటుపోయాయి? ఎంత మందికి ఉద్యోగాలిచ్చారు? ఎన్ని యూనిట్లు ప్రారంభిం చారు? సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దావోస్‌కు రెండుసార్లు వెళ్లి రూ. 2.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.. ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి? అని నిలదీశారు.