17 July, 2026 | 2:58 PM

15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించడం దుర్మార్గం

17-07-2026 02:51 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం 

చెరువును సందర్శించేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుత

సిరిసిల్ల, జులై 17,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, గ్రామాల అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేశ్ బి.గీతే, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపీ, స్థానిక బీజేపీ నేతలతో కలిసి అమృత్ 2 స్కీమ్ కింద రూ.1.32 కోట్ల నిధులతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న కార్గిల్ యుద్ధ శకటాన్ని సందర్శించి, కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు.

అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్గిల్ చెరువు పునరుద్దరణ చేసి మురుగునీరు రాకుండా సుందరికారంగా తీర్చిదిద్ది జిల్లా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చెరువును సందర్శించేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతమన్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు రాష్ట్రమంతా  కాంట్రాక్ట్  ను పట్టుకుని, ఎక్కడ పూర్తి స్థాయిలో పనులు చేయడం లేదని, ఇతర కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా సిండికేట్ లా మారి ఇబ్బందులు పెడుతున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తామని అన్నారు. అమృత్ స్కిమ్ను గొప్ప ఆశయంతో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారన్నారు. అమృత్ 1 మిషన్ కింద రూ.77 వేల 640 కోట్ల వ్యయం అంచనా వేస్తే కేంద్రం 35 వేల 990 కోట్లు కేటాయించింది. 2021 నాటికి అమృత్ 1 స్కీం పూర్తయ్యిందని, 2021 అక్టోబర్ లో అమృత్ 2 స్కీం పేరుతో 2 లక్షల 99 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తే, అందులో కేంద్రం తన వాటాగా 76 వేల 760 కోట్లు కేటాయించిందన్నారు.

అమృత్ 1 కింద తెలంగాణకు 1660 కోట్లు, అమృత్ 2 కింద 3వేల 429 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు అమృత్ పథకం కింద దాదాపు 400 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. తెలంగాణకు 12 ఏళ్లలో 13 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేసిందని, అయినా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా నయాపైసా కూడా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదని, సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నయాపైసా ఇవ్వలేదన్నారు.

అమృత్ స్కీం కింద కేంద్రం గ్రామాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం నిధులిస్తే... వాటిని అభివ్రుద్ధి పనులకు కాకుండా కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేస్తూ నిధులు డైవర్ట్ బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఆ లక్ష్యానికే ఉపయోగించాలని, నిధులను దారి మళ్లిస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వం తీరు మారకుండా కేంద్రానికి తాను లేఖ రాస్తే నిధులు ఆగిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. అదే సమయంలో కేంద్ర నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది జీతభత్యాలు, కరెంట్ బిల్లులకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం బాధాకరమన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.