17 July, 2026 | 3:19 PM

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ 'ఇందూర్ రణభేరి'

17-07-2026 03:06 PM

నిజామాబాద్,జూలై 17(విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను(Fee reimbursement) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద నిర్వహించిన 'ఇందూర్ రణభేరి' కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆలోచన ఇందూరు నుంచే ప్రారంభమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఆరోపించారు.

అలాగే, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో అన్యాయమైన నిబంధనలు తీసుకొచ్చారని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, యువత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను విస్మరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.