కాంగ్రెస్ 420 హామీలను 1000 రోజులు గడిచిన అమలు చేయలేదు
రైతాంగంపై వివక్ష చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై బిఆర్ఎస్ సమరభేరి...
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ర్యాలీలు చేస్తున్నరని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కొడిమ్యాల,సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Former MLA Sunke Ravishankar) ఆరోపించారు. గురువారం జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల అసమర్థ పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... ఎన్నికల ముందు రైతులకు 15 వేల రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 4 వేల పింఛన్,వికలాంగులకు 6 వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు 15 వేల రైతు భరోసా ఇచ్చి రోడ్డుపైకి రావాలి.. లేదంటే ఏ ముఖం పెట్టుకొని ర్యాలీలు నిర్వహిస్తున్నారు.సిగ్గుందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.
కొడిమ్యాల మండలంలో ఇప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ(Loan Waiver) పూర్తిగా జరగలేదని, రైతులకు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు తప్పడం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదని,సాగునీటి సమస్యలు పెరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను 1000 రోజులు గడిచినా అమలు చేయలేదని రవిశంకర్ ఆరోపించారు. ప్రజలకు అన్ని వర్గాల సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






