రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి
12-06-2026 03:11 PM
బీఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్
చర్ల,(విజయక్రాంతి): వర్షాకాలం మొదలై రైతులు పనుల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం లేదని బీఆర్‌ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావు విమర్శించారు. గత డిసెంబర్ నిధులు మార్చిలో ఒక్క ఎకరానికే జమ చేశారని, రెండో విడతపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన "ఎకరానికి 15 వేలు, కౌలు రైతులకు 10 వేలు, రుణమాఫీ" హామీలు తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో సీజన్ ముందే డబ్బులు జమ అయ్యేవని, 2018-2023 మధ్య 11 సార్లు రైతు బంధు ఇచ్చి 66 లక్షల మంది రైతులకు 70 వేల కోట్లు అందించారని గుర్తు చేశారు. తక్షణమే అన్ని ఎకరాలకు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






