ప్రజావాణికి 65 ఫిర్యాదులు
రంగారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ’ప్రజావాణి’ వినతులను సంబంధిత శాఖల అధికారులు ఏమాత్రం జాప్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన బాధితుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 65 ఫిర్యాదులు అందగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 21, ఇతర శాఖలకు చెందిన 44 దరఖాస్తులు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రతి అర్జీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కార మార్గాలను చూపాలని అధికారులకు సూచించారు.
జనాభా గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. జనాభా గణన-2027 సన్నాహక కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఒక్కరూ స్వీయ గణన (Self Enumeration) చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ పోర్టల్ (se.census.gov.in) సందర్శించి సెల్ఫ్ డిక్లరేషన్ ఐడి పొందాలని సూచించారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి వివరాలను అందజేయాలని తెలిపారు. ఈ ప్రక్రియపై జిల్లా సెన్సస్ ఇంచార్జి అధికారి శిరీష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






