17 August, 2026 | 6:03 PM

జీఎస్టీ కాదు బుక్క చిట్టీలతో భారీ మోసాలు

17-08-2026 04:50 PM

సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలపై ఫిర్యాదు

నాగర్‌ కర్నూల్, ఆగస్టు 17 (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ పట్టణంలోని కొన్ని సూపర్ మార్కెట్లు, ఏజెన్సీ, హోల్ సేల్ కిరాణా దుకాణాల్లో జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా వినియోగదారులను బుక్క చిట్టీలతో బిల్లులు ఇస్తూ భారీ మోసం చేస్తున్నారంటూ చెయూత వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు దాసరి శంకరయ్య సోమవారం ప్రజావాణిలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒరిజినల్ జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా కేవలం సాధారణ రశీదులు ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వినియోగదారుల నుంచి జీఎస్టీ మొత్తాన్ని వసూలు చేస్తున్నప్పటికీ, బిల్లుల్లో మాత్రం జీఎస్టీ నంబర్, పన్ను వివరాలు సక్రమంగా నమోదు చేయడం లేదని ఆరోపించారు. కొన్ని దుకాణాల్లో పాత మార్కెట్ పద్ధతుల్లోనే విక్రయాలు సాగిస్తూ, బిల్లుల జారీ విషయంలో నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు వినియోగదారులు కూడా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, బిల్లుల జారీ, జీఎస్టీ వసూళ్లను పరిశీలించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెయూత వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.