సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
షాద్నగర్, మార్చి 9 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని, సర్పంచ్ భర్త అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొత్తూరు మండలం కోడిచెర్ల తండా ఉప సర్పంచ్ స్వప్న రాందాస్ మరియు వార్డు సభ్యులు ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ నెల 7వ తేదీన నిర్వహించిన సాధారణ సమావేశం మరియు ’99 రోజుల ప్రణాళిక’ చర్చా కార్యక్రమం గురించి ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. సర్పంచ్ శాంతి విష్ణు నాయక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆమె భర్త కోర విష్ణు ఎన్నికైన వార్డు సభ్యులను సమావేశ మందిరంలోకి రాకుండా అడ్డు కుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ పాలనలో సర్పంచ్ భర్త అనవసరంగా జోక్యం చేసుకుంటూ ఆటంకాలు కలిగిస్తున్నారని వారు పేర్కొ న్నారు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో వార్డు సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని మరియు నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డు సభ్యులు సంతోష్ నాయక్, వినోద్ నాయక్, లలిత భాస్కర్ నాయక్, బిచ్య నాయక్ ఉన్నారు.




