30 May, 2026 | 4:31 PM

అయ్యగారు కట్ట చెరువు పనుల్లో అవకతవకలపై ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్

30-05-2026 03:32 PM

కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త నాయిని సంతోష్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని అయ్యగారు కట్ట చెరువు (సర్వే నెం.1512) పునరుద్ధరణ పనుల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై ఉన్నతస్థాయి సమగ్ర విచారణ జరిపించాలని మంథని పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త నాయిని సంతోష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ ఈఈ, మంథని ఆర్‌డీవో, మంథని మున్సిపల్ కమిషనర్ మరియు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ అధికారికి లిఖితపూర్వకంగా శనివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా నాయిని సంతోష్ మాట్లాడుతూ చెరువు పనుల్లో ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని ఆరోపించారు. ప్రధానంగా ఎదురవుతున్న అక్రమాలు ఇవేనని ఆయన పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు

 చెరువులో ప్రభుత్వ సాంకేతిక ప్రమాణాలకు విరుద్ధంగా భారీ గుంతలు తవ్వుతున్నారని,

హద్దుల ఉల్లంఘన

 శికం హద్దులు మరియు ఎఫ్‌టీఎల్  (ఎఫ్ టిఎల్) పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారుని,

 మట్టి అక్రమ రవాణా

 చెరువులో తవ్విన విలువైన మట్టిని అక్రమంగా తరలించి, భారీగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని,

జీవనాధారానికి గండి

ఈ అక్రమ తవ్వకాల వల్ల స్థానిక రైతులు, మత్స్యకారుల జీవనాధారానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిధుల దుర్వినియోగం

ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తూ, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.

సంతోష్ ప్రధాన డిమాండ్లు

అయ్యగారు కట్ట చెరువులో ప్రస్తుతం జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని, పనులపై పూర్తి స్థాయి సాంకేతిక మరియు ఆర్థిక విచారణ జరిపించాలని, 

 విచారణ పూర్తయ్యే వరకు కాంట్రాక్టరుకు ఎలాంటి బిల్లుల చెల్లింపులు చేయరాదని, అవకతవకలు రుజువైతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు మరియు బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

 బెదిరింపులపై రక్షణ కల్పించాలి

ప్రజా ధనం, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం తాను ఈ అవినీతిపై గళం విప్పినందుకు గాను, కొంతమంది వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని నాయిని సంతోష్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, సంబంధిత అధికారులు స్పందించి తగిన భద్రత కల్పించాలని ఆయన కోరారు. ప్రజాధనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని, అవినీతిని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.