28 February, 2026 | 7:44 PM

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

28-02-2026 05:21 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శనివారం మరిపెడ, బయ్యారం మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా, సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, త్రాగునీరు అందించాలని సూచించారు.

సీసీ కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. జిల్లాలో 18 పరీక్ష కేంద్రాల ద్వారా మొదటి సంవత్సరం 4,158, రెండవ సంవత్సరం 4,129, మొత్తం 8,287 విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, శనివారం 3,822 మంది పరీక్షలకు హాజరు కాగా, 65 మంది గైజరయ్యారన్నారు.

ఇప్పటికే పరీక్షల నిర్వహణపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ, సమావేశాలు నిర్వహించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసామని, ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపర్డెంట్స్,  డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్, ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష జరిగే సమయాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో ముందుకు సాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సిహెచ్ మదార్, సంబంధిత సిబ్బంది ఉన్నారు.