14 July, 2026 | 5:20 PM

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

14-07-2026 04:51 PM

నమోదు ప్రక్రియ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం పరిశీలన

యూరియా అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు

హెచ్చరించిన కలెక్టర్

గణపురం,(విజయ క్రాంతి): ఈ నెల 20వ తేదీలోగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండల కేంద్రంలోని 306 పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల యాప్ ద్వారా నమోదు సులభమని తెలిపారు. మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి పారదర్శక జాబితా రూపొందిస్తామని చెప్పారు. 

శిక్షణతోనే నాణ్యమైన విద్య: కలెక్టర్ రాహుల్ శర్మ

 ఉపాధ్యాయుల శిక్షణ ద్వారా విద్యాబోధన నాణ్యత పెరుగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహించిన  శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి, ఆధునిక సాంకేతికతతో బోధన అందించాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం ద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 6 పాఠశాలల్లో అమలు చేస్తున్నామని, మరిన్ని చోట్ల విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డా కుమారస్వామి, బాబూరావు, రాజేశ్వరరావు, భాస్కర్, విజయ్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

యూరియా అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

 పీఏసీఎస్ కేంద్రం ఆకస్మిక తనిఖీ 

 రైతులకు యూరియా సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని, అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. గణపురం పీఏసీఎస్ ఎరువుల కేంద్రాన్ని తనిఖీ చేసి, స్టాక్ వివరాలు పరిశీలించారు. నానో యూరియా వినియోగంపై రైతులకు సూచనలు ఇచ్చారు. గత ఏడాది కేటాయింపు, వినియోగంపై నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.