ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల విలువలు, రిజిస్టర్లు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులతో స్నేహపూర్వకంగా మెదలాలని తెలిపారు.
ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణుల వివరాలు పరిశీలించి గర్భిణులు తప్పనిసరిగా ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ల్యాబ్ ను సందర్శించి ప్రతిరోజు ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలు తెలుసుకున్నారు. వర్షాకాలం అయినందున అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించడంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు.
బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ తో కలిసి బెల్లంపల్లిలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ కృష్ణ తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ నెల 24వ తేదీ లోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. భూ భారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థులతో సరిచూసి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కార పురోగతిని సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల, మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వంటశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం తయారీకి వినియోగించే నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలించి ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఆయన వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.






