జనన గణన సామాజిక బాధ్యత: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా ప్రజలు జనగణన–2027లో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియను తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన–2027, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జనగణన దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, జనాభా గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ విధానాలను రూపొందిస్తాయని తెలిపారు.
ఈ ప్రక్రియలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొని సరైన సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. జనగణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో “ఇండ్ల జాబితా, ఇండ్ల గణన (HLO)” కార్యక్రమాన్ని చేపట్టి, మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. రెండో దశ జనాభా గణనను 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రజలకు “సెల్ఫ్ ఎన్యుమరేషన్” సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలు సహా మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.
నమోదు పూర్తైన అనంతరం లభించే 11 అంకెల “SE ID”ను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వీయ నమోదు పూర్తి చేసిన కుటుంబాలు మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు SE ID చూపిస్తే సరిపోతుందని, దీంతో గణన ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, సీపీఓ జీవరత్నం, డీపీఆర్వో విష్ణువర్ధన్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






