30 May, 2026 | 1:35 AM

జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అంకిత్

30-05-2026 01:00 AM

జూలురుపాడు/భద్రాద్రి కొత్తగూడెం, మే 29, (విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ అంకిత్ శుక్రవారం పరిశీలించారు. జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్న నిల్వలు తడిసాయా అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడంతో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు కలెక్టర్కు వివరించారు.

కేంద్రంలో నిల్వ ఉంచిన మొక్కజొన్న నిల్వలను, నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం కొనుగోలు జూలూరుపాడు కేంద్రంలో 3,600 మొక్కజొన్న బస్తాలు ఉన్నాయని, ఈరోజే మొత్తం లోడింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, కొనుగోలు కేంద్రం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.