4 March, 2026 | 11:45 PM

రాష్ట్రంలో రోల్డ్ మోడల్ గా హుజూర్ నగర్ హౌసింగ్ కాలనీ

04-03-2026 10:03 PM

ఈ నెల 14 హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవం

పేదలకు అందించే ఇండ్లను డంపింగ్ యార్డ్ గా మార్చిన  బీఆర్ఎస్

2023లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్‌కు కొత్త ఊపిరి పోసింది

పేదల జీవితాలలో వెలుగులు నింపడమే తన లక్ష్యం

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్: హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల 14 న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం పట్టణంలోని మోడల్ హౌసింగ్ కాలనీని అధికారులతో కలసి మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... రామస్వామి గుట్టలో 110 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ కాలనీ నిర్మించబడిందని 2,160 కుటుంబాలకు సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించ నున్నట్లు ఆయన తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను గృహనిర్మాణ శాఖామంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అనంతరం జరిగిన పరిమాణాలలో 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని ఆయన పేర్కొన్నారు.2023లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ శాఖా మంత్రిగా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌కు ఎట్టకేలకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే తుదిదశకు వచ్చిందన్నారు.

2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ వారు వివిధ సాకులతో మోడల్ కాలనీని నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చారని ప్రజల దీవెనలతో 2023లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్‌కు కొత్త ఊపిరి పోసిందని మంత్రి తెలిపారు.110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో ఈ గృహ కాలనీ నిర్మించబడిందని 2,160 ఆధునిక సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు నిర్మించి అంతే సంఖ్యలో కుటుంబాలకు వసతి కల్పించనున్నారు.

ఎండోమెంట్స్ శాఖ నుంచి భూమిని పూర్తి మార్కెట్ విలువ చెల్లించి,చట్టబద్ధమైన అన్ని అనుమతులతో ప్రభుత్వమే కొనుగోలు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.మార్కెట్ విలువ చెల్లించి ఎండోమెంట్స్ శాఖ నుంచి భూమిని కొనుగోలు చేసి, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలనీ నిర్మాణం చేపట్టిందని మంత్రి వివరించారు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని సుసంపన్నమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అత్యంత పేద కుటుంబాలు, గ్రామీణ కూలీలు, రైస్ మిల్ కార్మికులు, హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సమీప గ్రామాల నివాసితుల కోసం నిర్మించామన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరగాలని దృష్టి పెట్టారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అధికారుల బృందానికి ఈ బాధ్యత అప్పగించినట్లు ఆయన తెలిపారు.లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని,అర్హత లేని వారికి  ఈ జాబితాలో పేరు ఉండకూడదని అని మంత్రి స్పష్టం చేశారు.మొదటి దశలో కేవలం 1,000 మంది లబ్ధిదారులను మాత్రమే ఖరారు చేస్తున్నామని అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి,సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవక తవకలకు తావు లేకుండా పకడ్బందీగా ఇండ్ల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రారంభోత్సవానికి సన్నాహాలు కొనసాగుతున్నాయని కాలనీ పరిసర ప్రాంతాలను సుందరీకరిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను, లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ప్రత్యేక సభ వేదికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి నరసయ్య,మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు,తదితరులు,పాల్గొన్నారు.