15 June, 2026 | 4:06 PM

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

15-06-2026 02:57 PM
  1. కేసీఆర్ పాలనలో మెట్రో విస్తరణ జరగలేదు
  2. మెట్రో నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందున్నాయ్
  3. సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం
  4. రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చినా కూడా.. లోన్ డబ్బు విడుదల కాలేదు
  5. కిషన్ రెడ్డికి బాధ్యత లేదా?
  6. మెట్రో అనుమతుల కోసం కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేద్దామా?
  7. ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా?

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం గురించి చర్చ జరిగిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియాను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు. జంట నగరాల్లో ఉంటున్న 1.34 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రూ. 15 వేల కోట్లతో పూర్తికావాల్సిన మెట్రో రైలు నిర్మాణం.. రూ. 23 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదని రేవంత్ ఆరోపిపంచారు. మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందుగా ఉన్నాయని తెలిపారు.

సెకండ్ ఫేజ్ లో మెట్రో విస్తరణ అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ప్రతి ఏడాది రూ. 4 వేల కోట్ల నష్టం వస్తుందని ఎల్ అండ్ టీ చెప్పిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ ఒప్పుకోవడం లేదని తెలిపారు. రూ. 30 వేల కోట్ల ఎల్ అండ్ టీ ఆస్తులను రూ. 15 వేల కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఒక కిలో మీటర్ కు రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క చెప్పారు. ఎల్ అండ్ టీకి రూ. 13,600 కోట్ల అప్పు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. గతంలో కేసీఆర్ కు .. రూ. లక్షా 52 వేల కోట్లు అప్పుగా ఇచ్చారని వెల్లడించారు. గతంలో కేసీఆర్ కు ఆర్ఈసీ రూ. 1.61 లక్షల కోట్లు, ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 3.15 లక్షల కోట్లు అప్పుగా ఇచ్చారన్నారు.

రేవంత్ రెడ్డికి తేలికగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీకి ఇబ్బందులు వస్తాయని కిషన్ రెడ్డి.. ఖట్టర్, అశ్వినీకి చెప్పారు. గతంలో కిషన్ రెడ్డిని కేసీఆర్ ఏమని తిట్టారో ప్రజలందరికీ తెలుసు అని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చినా కూడా.. లోన్ డబ్బు ట్రాన్స్ ఫర్ కాలేదన్నారు. ఐఆర్ఎఫ్ సీ లోన్ మంజూరు చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న కిషన్ రెడ్డికి బాధ్యత లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ కలిసి మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకరించినందుకు కిషన్ రెడ్డికి గురుదక్షిన చెల్లిస్తున్నారని సూచించారు.

మెట్రో కొనుగోలు కోసం ఐఆర్ ఎఫ్ సీ నుంచి రూ. 13,600 కోట్ల రుణం మంజూరైంది.. రూ. 13,600 కోట్లకు 4 శాతం వడ్డీగా రుణం ఇప్పించామని తెలిపారు. ఐఆర్ఎఫ్ సీ లోన్ డబ్బులను కిషన్ రెడ్డి విడుదల చేయించాలని సీఎం  రేవంత్ డిమాండ్ చేశారు. లోన్ మంజూరు చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. మెట్రో బదిలీని చాలా కష్టపడి ఒక కొలిక్కి తీసుకువచ్చామన్న రేవంత్ రెడ్డి ప్రజలు ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. మరి మెట్రో విస్తరణకు మాత్రం కేంద్రం ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. 

ఇటీవల అహ్మదాబాద్, విశాఖ మెట్రోకు అనుమతి ఇచ్చి హైదరాబాద్ కు ఆపారని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష కొనసాగిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.మెట్రో అనుమతుల కోసం కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేద్దామా?, కిషన్ రెడ్డి వెనుక ఎవరున్నారో తాను నేరుగా చెప్పట్లేదని రేవంత్ తెలిపారు. కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రి కాబట్టి ఆయనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చి నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.