మోదీ కుట్ర చేస్తున్నారు! డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
- మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్.. రెండు వేర్వేలు అంశాలు
- మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు దూరం చేసిందే ఎన్డీయే సర్కార్
- డీలిమిటేషన్ చాలా ప్రమాదకర దిశలో వెళ్తోంది
- చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి మోదీ అన్యాయం చేసే కుట్ర
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు కీలకమైన అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. లోక్‌సభ స్థానాల పునర్విభజనపై హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రెండు అంశాలు దేశ ప్రజలందరికీ సంబంధించిన కీలకమైన అంశాలని సూచించారు. బీజేపీ మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలు తమకు సహకరించటం లేదని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్.. రెండు వేర్వేలు అంశాలని వివరించారు. బీజేపీ.. ఈ రెండు అంశాలను కలిపి రాజకీయం చేస్తోందని విమర్శించారు. మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. మొదట ఓటు హక్కు, తర్వాత రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధ పదువులను కూడా మహిళలకు ఇచ్చి గౌరవించిందని తెలిపారు.
రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును 2013లోనే సోనియా గాంధీ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. లోక్ సభలో బిల్లుకు మద్దతు దక్కకపోవటంతో బిల్లు మరుగున పడిందని వెల్లడించారు. గతంలోనే బీజేపీ మద్దతు ఇస్తే.. 2024 ఎన్నికల్లో అమలు జరిగి ఉండేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వమే మహిళలకు రాజకీయ రిజర్వేషన్లను దూరం చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండింటిని కలిపి ఇప్పుడు తీసుకువస్తున్నారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయాలని ఎన్డీయే చూస్తోందన్నారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్(Delimitation), మహిళా రిజర్వేషన్లను చేయాలనేది తమ డిమాండ్ అని రేవంత్ స్పష్టం చేశారు. ఈ రెండింటిని కలపటం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడంలో కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లను ఆర్నెళ్లలోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అనేది చాలా ప్రమాదకర దిశలో వెళ్తోందని సీఎం రేవంత్ హెచ్చరించారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోదీ చేస్తున్నారని ఆరోపించారు.




