రాజ్‌నాథ్ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హస్తినలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ మంత్రితో సీఎం రేవంత్ 20 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు రాజ్‌నాథ్ సింగ్‌కు((Union Defence Minister Rajnath Singh)) రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులలో ఒకటైన ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించి, భూసేకరణ, వినియోగ సేవలకు సంబంధించిన వ్యవస్థల (utilities) బదిలీ వంటి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆయన కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు.
దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ విమానాశ్రయ భారీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న సివిల్ ఏవియేషన్ టెర్మినల్ భవనం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెర్మినల్‌తో(Indian Air Force Terminal) పాటు, కార్గో, ఎమ్ ఆర్ వో, హ్యాంగర్ సదుపాయాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేయడంలో సహకరించాలని కోరారు.
మధ్య-ప్రాచ్య ఆసియాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థలు తమ హ్యాంగర్లను ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర సమీపంలో తాము ఎంపిక చేసిన ప్రదేశంలో, DRDO ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) భేటీ కానున్నారు.






